హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వ్యాప్కోస్ అందించిన సర్వే, నీటి లభ్యత గణాంకాల ఆధారంగానే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేశామని విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి అఫిడవిట్ల రూపంలో వివరాలను సేకరించారు.
తాజాగా వాటిపై బీఆర్కేభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌ను బుధవారం విచారించారు.