పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 30 : నాగర్‌కర్నూల్ జిల్లాలో పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన యువ రైతు నాగపురి శివ (28) గ్రామ శివారులో ఉన్న పొలంలో సాగు చేసిన మినుముల పంటకు నీళ్లు పెట్టేందుకు సోమవారం ఉదయం వెళ్లాడు. స్ప్రింక్లర్ పైపులను అమర్చుతుండగా.. పాముకాటుకు గురయ్యాడు.
పక్క పొలంలోని రైతులు గమనించి వెంటనే అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నాడు.
జగిత్యాల జిల్లాలో మరో రైతు
కథలాపూర్, డిసెంబర్ 30: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండలో జరిగింది. ఎస్ఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండకు చెందిన రైతు పొన్నం ప్రసాద్(40) ఉపాధి కోసం గతంలో అప్పు చేసి దుబాయ్ వెళ్లాడు. మూడేండ్లు పనిచేసి, స్వగ్రామానికి వచ్చాడు. మరింత అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాడు.
గల్ఫ్ వెళ్లేందుకు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోడంతో మనస్తాపం చెందాడు. ఈ నెల 14న పంట చేనువద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రసాద్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.