తలమడుగు, అక్టోబర్ 5 : అప్పులబాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. తలమడుగు మండల కేంద్రానికి చెందిన కాడే లస్మన్న (65) తనకున్న మూడెకరాల్లో పత్తి పంట వేశాడు. పెట్టుబడి కోసం ప్రైవేట్‌గా రూ.4 లక్షలు, మహారాష్ట్ర బ్యాంకులో రూ. 1.5 లక్షల అప్పు తెచ్చాడు.
అవి ఎలా తీర్చాలనే బెంగతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం తన వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లస్మన్నకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. లస్మన్న భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాధిక తెలిపారు.