మహబూబ్‌నగర్, జూలై 30 : పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన రైతును 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తున్న క్రమంలో ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మూసాపేట మండలం నిజాలాపూర్‌కు చెందిన రైతు భోజయ్య (60) బుధవారం తన పొలంలో పనిచేస్తుండగా.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను మూసాపేట మండల కేంద్రంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని పాలమూరులోని ఓ ప్రైవేట్ దవాఖానకు రిఫర్ చేశారు.
ఈ క్రమంలో 108 అంబులెన్స్‌లో భోజయ్యను తరలిస్తుండగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆక్సిజన్ పెట్టాలని కుటుంబ సభ్యులు కోరగా ఆక్సిజన్ సిలిండర్ కిట్ పనిచేయడం లేదని సిబ్బంది చెప్పారు. దీంతో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే భోజయ్య ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకనే భోజయ్య మరణించాడని కుటుంబ సభ్యులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. అత్యవసర సమయంలో ఆదుకోవాల్సిన 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేక తన తండ్రి చనిపోయాడని కొడుకు శ్రీనివాసులు ఆవేదన చెందాడు. ఇదే విషయాన్ని ఎక్స్‌లో పోస్టుచేశాడు.
అత్యవసర సమయంలో పేదలకు అందుబాటులో ఉండి ఆపద్బాంధవుడిలా ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం గాడి తప్పిన ప్రజాపాలనకు నిదర్శనమని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఓ రైతు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. సరైన సమయంలో ఆక్సిజన్ అందించి ఉంటే బతికే అవకాశం ఉండేదని అన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు.