తుంగతుర్తి, నవంబర్ 23 : ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం బాగాలేదని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా వెనక్కి పంపడంతో మనస్తాపం చెందిన రైతు దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామ ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకున్నది. మద్దిరాల మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమానాయక్ తాను పండించిన ధాన్యాన్ని అన్నారంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. నిర్వాహకులు తేమ శాతం చూసి కాంటా వేసి మరో ముగ్గురు రైతుల ధాన్యంతో కలిపి లారీలో కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఈ నెల 17న పంపించారు. తాలు అధికంగా ఉన్నదని సదరు మిల్లు యాజమాన్యం దిగుమతి చేసుకోలేదు.
రైతులు వెళ్లి మాట్లాడగా క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని చెప్పారు. అందుకు రైతులు ఒప్పుకోలేదు. దీంతో మిల్లర్లు శనివారం ధాన్యాన్ని వెనక్కి పంపించగా మనస్తాపానికి గురైన రైతు కీమానాయక్, అతని భార్య పున్నమ్మ అన్నారంలోని కొనుగోలు కేంద్రం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న రైతులు పెట్రోల్ బాటిల్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దయానందం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధాన్యం లారీని మరో మిల్లుకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రం ఏజెన్సీని తొలగించి ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. సదరు ధాన్యం లారీని మరో మిల్లుకు పంపించి దిగుమతి చేయించారు.