మెదక్ : కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కరెంట్, నీళ్లు లేక పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతూ ఉసురు తీసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా(Medak Dist) రామాయం పేట మండలం అక్కన్నపేటలో అప్పుల బాధ తాళలేక మంగళవారం తెల్లవారుజామున కౌలు రైతు వెల్ముల ప్రవీణ్ ఆత్మహత్య(Farmer Commits suicide) చేసుకున్నాడు. కుటుంబు సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెల్ముల ప్రవీణ్(33), తన కుమారుడు కలిసి సోమవారం రాత్రి ఇంట్లో ఒకేగదిలో పడుకున్నారు.
ఉదయం కుమారుడు లేచి చూసేసరికి తండ్రి దూలానికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. వెంటనే బయటకు వచ్చి తన తల్లికి చెప్పడంతో ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి తాడు విప్పేసి చూశారు. అప్పటికే మృతి చెందాడు. కాగా, ప్రవీణ్ కొంతకాలంగా అప్పులతో బాధపడుతున్నట్లు భార్య జ్యోతి తెలిపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.