నర్సాపూర్, జనవరి 11: కాంగ్రెస్ పాలనలో రైతుల ప్రాణాలకు లెక్కలేకుండా పోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో మెదక్ జిల్లాలో 60 ఏండ్ల రైతు ప్రమాదకర పరిస్థితులో విద్యుత్తు స్తంభం ఎక్కి స్వయంగా మరమ్మతులు చేపట్టిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. నర్సాపూర్ పట్టణ పరిధిలోని హన్మంతాపూర్ శివారులో నాలుగు రోజుల క్రితం స్తంభం నుంచి 11 కేవీ విద్యుత్తు వైరు తెగి బురద పొలంలో పడింది. అక్కడి ట్రాన్స్ఫార్మర్ కూడా పనిచేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో నారుకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన కరువైంది.
రైతులు కొందరు శనివారం నర్సాపూర్‌లోని సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఏఈ రామ్మూర్తికి సమస్యను విన్నవించారు. ఆయన వారి వెంట గ్రామానికి వచ్చి రావడంతోనే అంతా బాగానే ఉన్నదని సెలవిచ్చారు. కానీ స్తంభం ఎక్కి వైరు బిగించాలని కోరితే తనవల్ల కాదని, పైగా సిబ్బంది లేరని చేతులెత్తేశారు. చేసేదేమీలేక నారాయణ అనే రైతు స్తంభం పైకి చేరుకొని వైరు సరిచేశాడు. రైతు స్తంభం ఎక్కి వైరు అతికించే వరకు అక్కడి రైతులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఒక వేళ రైతుకు ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్తు అధికారులు సత్వరమే స్పందించి రైతులు స్తంభాలు ఎక్కడం, ట్రాన్స్ఫార్మర్ను సరిచేసే పరిస్థితిని తీసుకురావొద్దని పలువురు సూచిస్తున్నారు