మల్లాపూర్, ఏప్రిల్ 21: బతికుండానే అధికారులు కాగితాల్లో తనను చంపేశారని, తన భూమిని విరాసత్ ద్వారా ఓ మహిళకు పట్టా చేశారని జగిత్యాలకు చెందిన ఓ రైతు ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్ ఆఫీస్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. బాధిత రైతు మంగళారపు గంగారాం కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం మొగిలిపేట పక్కన ఉన్న సంగెం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 82/1లో గంగారాంకు ఎకరం 27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో పొలం నాటువేశాడు. నిరుడు రుణమాఫీ కావడంతో బ్యాంకులో తన భూమికి సంబంధించి 1బీ ఇచ్చేందుకు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఓబులాపూర్కు చెందిన ఓ మహిళా రైతు పేరు మీద పట్టా ఉన్నట్టు కనిపించడంతో హతాశుడయ్యాడు. వెంటనే అప్పటి తహసీల్దార్, సిబ్బందిని కలిసి తాను బతికుండగా వేరేవాళ్లకు ఎలా పట్టా చేశారని ప్రశ్నించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
సమాచారహక్కు చట్టంతో వివరాలను సేకరించగా.. అక్రమ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి అధికారుల అండతోనే ఈ వ్యవహారానికి పాల్పడినట్టు తెలిసిందని తెలిపాడు. అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా.. ఎన్ని ఫిర్యాదులు చేసినా న్యాయం జరుగడంలేదని వాపోయాడు. తన భూమిని తనపై పట్టా చేయాలని, పట్టాకు సహకరించిన అప్పటి తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. ఈ దీక్షకు నాయీబ్రాహ్మణ సేవాసంఘం మండల నాయకులు సంఘీభావం ప్రకటించారు. స్థానిక తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్ వచ్చి బాధిత రైతు, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, దీక్షను విరమింపజేశారు.