మానకొండూర్ రూరల్, జూలై 1 : నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన తనకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్రనష్టం జరిగిందంటూ ఓ రైతు రహదారి పనులను అడ్డగించడంతో అరెస్ట్ చేశారు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో చోటుచేసుకున్నది. చెంజర్ల గ్రామానికి చెందిన రైతు కానిగంటి కుమార్ గ్రామ ఎల్లమ్మ గుడి దగ్గర జరుగుతున్న జగిత్యాల-వరంగల్ నేషనల్ హైవే (563) పనులను అడ్డగించాడు. చెంజర్ల, మానకొండూర్ గ్రామాల రైతులు కూడా తరలివచ్చి మద్దుతు పలికారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసుల అధికారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు సంజీవ్, సదన్ కుమార్ పోలీస్ బలగాలతో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధిత రైతు కానిగంటి కుమార్, గ్రామస్థులతో ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ విజయ్ కుమార్ చర్చించారు. వారు ససేమిరా అనడంతో బాధితుడు కుమార్‌తోపాటు ఆయన కొడుకు విజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల పహారా మధ్య తిరిగి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.