హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు సీనియర్‌నేతలు దండకారణ్య స్పెషల్ జోనల్ సెక్రటేరియట్ సభ్యుడు మాల సంజీవ్ అలియాస్ అశోక్ అలియాస్ లెంగు దాదా (62), ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పెరుగుల పార్వతి అలియాస్ దీనా(50) రాచకొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాట చేసి, వివరాలు వెల్లడించారు.
మావోయిస్టు సిద్ధాంతానికి కాలం చెల్లడం, అనారోగ్య సమస్యల కారణంగానే వారు లొంగిపోయినట్టు చెప్పారు. మావోయి జం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వ అందిస్తున్న సహకారం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం గడుపాలనే ఉద్దేశంతో ఇరువురు బయటకు వచ్చినట్టు వెల్లడించారు. ఇతర మావోయిస్టులు కూడా తిరిగి గ్రామాలకు రావాలని, తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి పునరావాస పథకం కింద లభించే ఫలితాలు అందిస్తామని చెప్పారు.
సంజీవ్ స్వస్థలం మేడ్చల్ జిల్లా యాప్రాల్. 1980లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లోని జననాట్య మండలిలో గద్దర్ నేతృత్వంలో చేరి, 1986 వరకు పనిచేశారు. 16 రాష్ర్టాలలో పీపుల్స్‌వార్‌లో రిక్రూట్మెంట్కు యువతను ఆకర్షించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గద్దర్ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఈ సమయంలోనే 1982లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన పంజాల సరోజ అలియాస్ విద్యను వివాహం చేసుకున్నారు. 2002లో ములుగు జిల్లాలోని అయిలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె మరణించారు. 2007లో పెరుగుల పార్వతిని పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ చైతన్య నాట్యమంచ్ ఆధ్వర్యంలో దండకారణ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరిజనులను మావోయిస్టు పారీ ్టవైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. సంజీవ్‌పై రూ.20లక్షల రివార్డు ఉంది.
నాగర్‌కర్నూల్ జిల్లా వంకేశ్వరం గ్రామానికి చెందిన పెరుగల పార్వతి 1992లో పీపుల్స్‌వార్ గ్రూప్‌లో అప్పర్ ప్లాటూన్ దళంలో చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పని చేశారు. 2007లో మాల సంజీవ్‌ను పెండ్లి చేసుకున్నారు. 2016లో డివిజన్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది, చైతన్య నాట్యమంచ్ సాంస్కృతిక ఉపసమితి సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. పార్వతిపైనా రూ. 20 లక్షల రివార్డు ఉంది.