Prathyusha Garimella | ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఇంట్లోని బాత్రూంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చి.. ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు ప్రత్యూష దుస్తులు డిజైన్ చేశారు. దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతి హసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ, నిక్కీ గల్రానీ, కృతి కర్భంద, ప్రణీతతో పాటు పలువురు తారలకు డ్రెస్‌లు డిజైన్ చేశారు. చాలా మంది సెలబ్రిటీలకు ప్రత్యూష ఎండార్స్ చేశారు. దక్షిణ భారతంలోని దాదాపు అందరు హీరోయిన్లకు డ్రెస్‌లు డిజైన్ చేశారు. అయితే, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొంతకాలంగా ప్రత్యూష డిప్రెషన్లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.