కొల్లాపూర్, మే 16 : అధికార పార్టీకి చెం దిన కౌన్సిలర్ భూకబ్జా చేయడంతో బాధిత కుటుంబం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరసన చేపట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో చోటు చేసుకున్నది. బాధితులు రామకృష్ణ, వెంకటేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు వెనుక భాగంలోని సర్వే నంబర్ 104లో 20 నిరుపేద కుటుంబాలు ప్లాట్లను కొనుగోలు చేశాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఎండీ ఖాదర్ అధికార బలంతో తమ విలువైన ప్లాట్లను కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు.
తమ ప్లాట్లు తమకు కావాలని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టి.. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ ఐదేండ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. హైదరాబాద్ వంటి చోట్ల వాచ్మెన్ పనిచేసుకునే వాళ్లమని, కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో ఎవరూ పనిలో పెట్టుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసులను వాపస్ తీసుకుంటామని నమ్మించి తమ ప్లాట్లను కబ్జా చేసి వాటిస్థానంలో ఎందుకూ పనికిరాని ప్లాట్లను ముట్టజెప్పే యత్నం చేసినట్టు తెలిపారు. మూడో వ్యక్తికి తెలియకుండా రిజిస్ర్టేషన్ సవరణ చేసుకోవాలని చెప్పారని వెల్లడించారు.
అధికార పారీకి చెందిన కౌన్సిలర్ నుంచి రక్షించి, తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బాధిత కుటుంబానికి పోలీసుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. విధిలేని స్థితిలో పిల్లలతో ఎవరికీ ఆటంకం లేకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో హైడ్రామా నెలకొన్నది. బాధిత మహిళ తన పిల్లలకు అక్కడే పాలు ఇవ్వడంతో పాటు అల్పాహారం పెట్టి.. న్యాయం కోసం పోరాడుతుండడంతో చూసిన స్థానికులు సానుభూతి తెలిపారు. ప్రజల మద్దతు పెరుగుతుండడంతో పోలీసులు వాహనంలో బాధిత మహిళతోపాటు చంటి పిల్లలను ఎక్కించేందుకు ప్రయత్నంచేశారు. ఈ ఘటనను మీడియా చిత్రీకరిస్తుండగా గమనించిన పోలీసులు కారులోకి ఎక్కిన చంటి పిల్లలను వదిలి బాధితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.