సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 8 : ఓ వ్యక్తి 55 ఏండ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన గంట్ల నర్సమ్మ-పెద్దపాపయ్య దంపతులకు ఆరుగురు సంతానం. అందులో పెద్ద కొడుకు గంట్ల కన్నయ్య 12 ఏండ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లాడు. అప్పట్లో అతడి కోసం వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. ఇంటినుంచి వెళ్లిన కన్నయ్య వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరికి హర్యానాలో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పరిచయం కావడంతో కన్నయ్య తన వివరాలతోపాటు ఫోన్ నంబర్ ఇచ్చాడు. సదరు వ్యక్తి రాసిన లేఖ వారం క్రితం కన్నయ్య కుటుంబ సభ్యులకు చేరింది. వెంటనే అతని తల్లి నర్సమ్మ.. కొడుక్కి ఫోన్ చేసి ఇంటికి రావాలని వేడుకున్నది. ఆదివారం తెల్లవారుజామున కన్నయ్య పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి స్వాగతం పలికారు. ఇంటి నుంచి వెళ్లిన కన్నయ్య ఎలా కాలం వెళ్లదీశాడో కుటుంబ సభ్యులకు వివరించాడు.