పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో మరణించిన వారి కుటుంబ సభ్యులు వేదన వర్ణణాతీతంగా ఉంది. పరిశ్రమ వద్దకు వచ్చి తమవారి మృతదేహాలు కూడా లభించని దుస్థితిని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంధుమిత్రులకు అక్కడి పరిస్థితిని ఫోన్లో వివరిస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం ఓ బాధితుడు బంధువులతో ఫోన్ మాట్లాడుతూ రోదిస్తున్న దృశ్యం
KCR | హైదరాబాద్/పటాన్చెరు రూరల్, జూలై 1 : ‘కేసీఆర్ సీఎంగా ఉంటే మాకు న్యాయం జరిగేది. సీఎం రేవంత్.. నీకు పాలన చేతకాదు. పక్కకు తప్పుకో’.. అంటూ తమవారి ఆచూకీ కోసం వచ్చిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమకు మంగళవారం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. కొందరు ధ్వంసమైన గోడవైపుగా పరిశ్రమలోకి చొచ్చుకొని పోయేందుకు యత్నించారు. ‘మీకు చేతకాకపోతే చెప్పండి, శిథిలాల్లో మేమే వెతుక్కుంటాం’అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేయగా వారు తిరగబడ్డారు. ముఖ్యంగా యూపీ, బీహార్, ఒడిశాకు చెందిన.. గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు పోలీసులను, ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. కొందరు శాపనార్థాలు పెట్టారు. అదే సమయంలో కొందరు యువకులు ‘కేసీఆర్ జిందాబాద్. ఆయన సీఎంగా ఉంటే మాకు న్యాయం జరిగేది’ అని హిందీలో నినాదాలు చేశారు. అదే సమయంలో కొందరు క్యారీ బ్యాగుల్లో, బూడిదను సేకరించి తీసుకెళ్లడం అందరినీ కదిలించింది. తమ వారిని ఎలాగూ అప్పగించరని, బూడిదనైనా తీసుకెళ్లి, అంత్యక్రియలు చేసుకుంటామని వారు చెప్పడం అందరితో కన్నీళ్లు పెట్టించింది.
రెండు జేసీబీలతో ఎంతకాలం పనిచేస్తారని గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు అధికారులను నిలదీశారు. రెండు రోజులు గడుస్తున్నా కూలిపోయిన బ్లాక్లో సగం శిథిలాలు తొలిగించకపోవడంతో.. వారిలో ఆగ్రహానికి కారణమైంది. తమవారి ఆచూకీ కోసం వెతుకుతున్న వారికి శిథిలాల్లోనైనా మృతదేహాలు లభ్యమవుతాయని అక్కడే పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు డీజిల్ అయిపోయిందని జేసీబీలు నిలిపివేయడంతో పట్టరాని కోపంతో ఊగిపోయారు. మరో రెండు జేసీబీలు ఏర్పాటు చేసి, శిథిలాలు త్వరగా తొలగించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుపై పాశమైలారం బాధితుల కుటుంబ సభ్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘కేసీఆర్ జిందాబాద్.. రేవంత్రెడ్డి ముర్దాబాద్..’ అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి రాక సందర్భంగా తమను ఆమడదూరంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా సార్ ఉన్నప్పుడే తమ బతుకులు బాగున్నాయని బీహార్, ఒడిశా, తమిళనాడు కార్మికులు పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికారులు ఫ్యాక్టరీలను తనిఖీ చేసేవారని తెలిపారు. ఇప్పుడు ఎక్కడేం జరుగుతున్నదో ఎవరికీ తెలియడం లేదని పప్పుకుమార్చౌదరి అనే ప్యాకింగ్ సెక్షన్ కార్మికుడు ఆగ్రహం వ్యక్తంచేశాడు. ‘సీఎం అంటే ఏంటో కేసీఆర్ను చూసి నేర్చుకో.. లేకపోతే మా రాష్ర్టానికి రా’ అంటూ రేవంత్ తీరుపై మండిపడ్డారు. ‘కేసీఆర్ జిందాబాద్.. రేవంత్రెడ్డి ముర్దాబాద్’ అంటూ పదే పదే నినాదాలు చేస్తుంటే అందరూ అటువైపే చూశారు.