బయ్యారం, నవంబర్ 6: మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సీఐ బాలాజీ కథనం ప్రకారం.. బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మదీనా ఫెర్టిలైజర్ యజమాని షేక్ మీరాకు గత నెల 31న ఓ వ్యక్తి ఫోన్ చేసి మావోయిస్టు జగన్ దళ సభ్యుడినని, పార్టీ ఫండ్ రూ.50 వేలు తీసుకొని నామాలపాడు అటవీ ప్రాంతానికి రావాలని బెదిరించాడు.
అతను రూ. 20 వేలు ఇచ్చేందుకు వెళ్లగా కత్తితో బెదిరించి మరో రూ.20 వేలు వసూలు చేశాడు. శనివారం నామాలపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా మండలంలోని మొట్లగూడెంకు చెందిన ఆటో డైవర్ షేక్ యూసుబ్, చుంచుబందం తండాకు చెందిన ఫెర్టిలైజర్ షాప్ యజమాని ధరావత్ శేఖర్, సంత్రాల పోడ్ తండాకు చెందిన బానోత్ రవీందర్ పారిపోతుండుగా పట్టుకున్నారు.
వీరిని విచారించగా కొత్తగూడెం జిల్లా గుండాల, కొమరారం, ఇల్లందు, బయ్యారం, మహబూబాబాద్ ప్రాంతాల్లో రెండు నెలలుగా రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.2 లక్షల నగదు, 3 తులాల బంగారం, రెండు కార్లు, బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.