హిమాయత్‌నగర్ జూన్ 7: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మావోయిస్టు నాయకులు బండి ప్రకాశ్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడ్ ఏరియా కార్యదర్శి రామన్న తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్టు ఇప్పటికీ ప్రకటించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. కగార్ పేరుతో ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. బూటకపు ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.