హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయంలో ఓ నకిలీ ఉద్యోగి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించుకొని, కొంతకాలంగా చలామణి అవుతున్నాడు. చివరికి ఆ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్సై యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు. నకిలీ ఉద్యోగిపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఎస్పీఎఫ్ కథనం ప్రకారం.. ఈ నెల 28న సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బయటికి వచ్చి అధికారులతో మాట్లాడుతుండగా తడికమళ్ల భాస్కర్‌రావు సీఎం, ఉన్నతాధికారులు కనిపించేలా సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న ఎస్పీఎఫ్ ఏఎస్సై రాంబాబు కు అనుమానం వచ్చి, అతడిని పిలిచి విచారించారు.
సంబంధం లేకుండా సమాధానాలు ఇవ్వడంతో సీఎస్‌వో కార్యాలయానికి తీసుకెళ్లారు. భాస్కర్రావుది ఖమ్మం జిల్లా కామేపల్లి మం డలం ముచ్చెర్ల గ్రామంగా గుర్తించారు. అతడి దగ్గర విజిటర్స్ పాస్ కూడా లేకపోవడంతో అతడి జేబులు, పర్సు వెతకగా ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు లభించింది. అందులో రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఐడీ కార్డుపై అనుమానం రావడంతో ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా రెవెన్యూ శాఖలో ఆరా తీయగా అలాంటి ఉద్యోగి లేడని తేలింది. తాను నకిలీ ఐడీ కార్డుతో కొన్నాళ్లుగా సచివాలయంలోకి వచ్చి వెళ్తున్నట్టు ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో.. మైనార్టీ సంక్షేమ శాఖలోని ఓ అధికారి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తి భాసర్రావుకు నకిలీ ఐడీ కార్డు తయారు చేసి ఇచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. రవిని సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వారిద్దరు కలిసి ఏయే అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.