హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : చర్మంపై దురద మాదిరిగా రాష్ట్రంలో ఫేక్ డెర్మటాలజీ క్లినిక్‌లు పుట్టుకొస్తున్నాయి. చర్మవ్యాధుల నిపుణులమంటూ లైసెన్స్ లేకుండానే కాస్మెటిక్ సెంటర్లు నిర్వహిస్తుండడం, ఫేక్ వైద్యులు ట్రీట్మెంట్ చేస్తుండడంతో లేజర్ బర్న్‌లు, కెమికల్ పిల్ గాయాలు, స్టెరాయిడ్లతో దెబ్బతిన్న చర్మం, ఇన్ఫెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మెడివాయిస్, చర్మవ్యాధి నిపుణులు చేసిన తాజా సర్వేలోనూ ఇదే విషయం తేలగా, ఇలాంటి పరిణామాలతో ప్రజారోగ్యానికి ప్రమాదం తప్పదని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
86 శాతం మందికి అర్హతల్లేవు
బ్యూటీ పార్లర్లు, స్పా, ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించే క్లినిక్‌ల యాజమాన్యాలు తమదందాకు సోషల్‌మీడియాను ప్రచారసాధనంగా వాడుకుంటున్నాయి. ఆకర్షితులైన జనాలు ట్రీట్మెంట్కు ఉత్సాహం చూపుతుండడంతో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో సుమారు 86శాతం మంది ఎలాంటి అర్హత లేకుండానే చర్మవ్యాధి నిపుణులమంటూ చికిత్స చేస్తున్నట్టు తేలింది. దీంతో సరైన ట్రీట్మెంట్ అందకపోవడంతో ముఖంపై లోతైన కాలిన గాయాలు, మచ్చల పిగ్మెంటేషన్, పీఆర్పీ సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఫిల్లర్ ప్రేరిత వాస్కులర్ గాయాలు, గడ్డల కేసులు నానాటికి పెరుగుతున్నాయి.
ఐటీ ఉద్యోగులే లక్ష్యం
ఆన్లైన్లో అడ్డగోలుగా కొనుగోలు చేసిన యంత్రాలతో ఎలాంటి శిక్షణ లేకుండానే కొంతమంది చికిత్స చేస్తున్నట్టు వైద్యనిపుణులు తేల్చారు. చర్మానికి కాంతి వస్తుందని, ముఖంపై మచ్చలు తొలగిస్తామనే ప్రకటనలతో ఫేక్ క్లినిక్‌లు విస్తృతంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తుండడంతో యువతులు, ఐటీ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు బాధితులుగా మారుతున్నారని పలు ఎన్జీవోలు వెల్లడిస్తున్నాయి. చికిత్స వికటిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అడ్డగోలుగా వెలుస్తున్న ఫేక్ డెర్మటాలజీ క్లినిక్‌లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న లేజర్ కేంద్రాలను వెంటనే మూసివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పార్లర్ ఆధారిత వైద్య విధానాన్ని రాష్ట్రంలో నిషేధించాలని, ఆన్లైన్ కాస్మొటిక్ ప్రకటనలను నియంత్రించాలని కోరుతున్నారు. అర్హత లేని వారిని నియమించుకుంటున్న క్లినిక్‌లపై భారీగా జరిమానాలు వేసి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు
చర్మ వ్యాధుల చికిత్స పేరిట అడ్డగోలుగా వెలుస్తున్న 100కు పైగా క్లినిక్‌లపై ఇటీవల దాడులు నిర్వహించాం. 26 క్లినిక్‌లపై కేసుల నమోదుకు ఆదేశించాం. ఎంబీబీఎస్, ఎండీ (డెర్మటాలజిస్ట్) చదివిన వారే చర్మవ్యాధుల చికిత్సలు చేయాలి. ఎలాంటి అర్హత లేకున్నా కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు, పీఆర్పీ థెరపీలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అర్హత లేకుండా చర్మవ్యాధుల చికిత్సలు చేస్తే కఠిన వ్యవహరించడమేకాకుండా క్లినిక్‌లపై పోలీస్ కేసుల దిశగా సిఫారసు చేస్తాం.
-డాక్టర్ శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్