హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో దర్శన టికెట్లపై ఉన్న తేదీలను ఎడిట్ చేసి భక్తులకు అంటగడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 14న శ్రీశైలం దేవస్థానానికి కొంతమంది భక్తులు వచ్చారు. రద్దీ ఎకువగా ఉండటంతో దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించారు.
ఈ క్రమంలో వారి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వామివారి దర్శన టికెట్లు ఇప్పిస్తామని వేలరూపాయలు తీసుకుని నకిలీ టికెట్లు అంటగట్టారు. టికెట్లు తీసుకున్న భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించగా.. సానింగ్ సెంటర్ వద్ద టికెట్లు నకిలీవని అధికారులు తేల్చారు. ఈ విషయంపై దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు వీరు పాత టికెట్లపై ఉన్న తేదీలను ఎడిట్ చేసి భక్తులకు అంటగడుతున్నట్టు గుర్తించారు. అయితే ఎవరు పడితే వారు టికెట్లు విక్రయిస్తే కొనుగోలు చేయొద్దని.. కేవలం కౌంటర్లలోని టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు ఆలయ అధికారులు సూచించారు.