గాంధారి, జనవరి 19: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 నోట్లు కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చద్మల్తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధికి భక్తులు పెద్ద మొత్తంలో కానుకలు, విరాళాలు సమర్పిస్తారు. ఆ డబ్బులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తండాలో అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తారు. కమిటీలోని ఓ బాధ్యుడు ఉత్సవాల అనంతరం వడ్డీకి ఇచ్చి, తిరిగి జాతర సందర్భంగా వాటిని తీసుకుంటాడు. రూ.కోటి వరకు ఆలయ డబ్బులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది కూడా జాతర అనంతరం డబ్బులను తండాలో అవసరం ఉన్న పలువురికి వడ్డీకి ఇచ్చారు. కాగా ఇందులో ప్రతి ఐదు వందల నోట్ల కట్టలో నాలుగు నకిలీ నోట్లు ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఈ విషయమై బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తండాలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.