మందమర్రి, మార్చి 26 : : మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం మందమర్రి సర్కిల్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ వివరాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్టు సమాచారమందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ రజాక్‌ను విచారించగా.. పొన్నారం గ్రామానికి చెందిన బొలిశెట్టి జనార్దన్, పట్టణానికి చెందిన కాశిపాక తిరుపతికి నకిలీ విత్తనాలు విక్రయించినట్టు తెలిపాడు. దేవాపూర్, చింతగూడ సమీపంలోని సల్పలవాగులో నకిలీ విత్తనాలు దాచి, వీలున్నప్పుడల్లా రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుల వద్ద రూ. 7,87,500 విలువైన 3.15 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.