Fake Calls | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్ఆర్డీఎస్) అధికారులమని చెప్పి కొందరు సైబర్ నేరగాళ్లు నర్సులను మోసం చేస్తున్నారని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) తెలిపింది. తాము చెప్పినట్టు వినకుంటే రిజిస్ట్రేషన్ రద్దవుతుందని బెదిరిస్తున్నారని పేర్కొన్నది. ఇలాంటివారిని నమ్మవద్దని సూచించింది. ఎన్ఆర్డీఎస్ గురించి ఐఎన్సీ నేరుగా నర్సులకు ఫోన్ చేయదని స్పష్టంచేసింది. నర్సుల్లో ఎవరికైనా రిజిస్ట్రేషన్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే తమకు ఈ-మెయిల్ చేయాలని సూచించింది. ఎవరైనా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని తెలిపింది.