సుబేదారి, డిసెంబర్ 1: ప్రభుత్వ అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడిన నకిలీ ఏసీబీ డీఎస్పీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఠా సభ్యుల అరెస్ట్ చూపించి, వివరాలు వెల్లడించారు. ఏపీలోని సత్యసాయిపుట్టపర్తి జిల్లా నల్లగూడ మండలం వేలమద్దికి చెందిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, కర్ణాటకలోని రాంనగర్ జిల్లాకు చెందిన నవీన్, సూర్యప్రకాశ్, బెంగళూరుకు చెందిన మంగళ రవీందర్, మురళి, ప్రసన్న, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ ముఠాగా ఏర్పడ్డారు.
రాచంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వ అధికారులు, రిటైర్మెంట్కు దగ్గర ఉన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తాను ఏసీబీ డీఎస్పీని అంటూ ఫోన్లు చేసేవాడు. ‘మీ మీద ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదు చేశామని, దాన్నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలి’ అని బెదిరించేవాడు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తుమ్మల జైపాల్‌రెడ్డికి ఫోన్ చేసి బెదిరించడంతో ఆయన 9.96 లక్షలు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్, నవీన్, మంగళ రవీందర్, మురళి, ప్రసన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తేలింది.