కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 10: సీబీఐ అధికారినంటూ ఓ మహిళ నగల దుకాణానికి వచ్చింది. బంగారు ఆభరణాన్ని తీసుకున్నది. నకిలీ చెక్కుతో యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి ఉడాయించింది. త్రీ టౌన్ ఎస్సై ముత్తినేని సోమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం చిన్నబజార్‌లోని ఓ నగల దుకాణానికి ఈ నెల 8న ఓ మహిళ వచ్చింది. తాను సీబీఐ అధికారినంటూ షాపు యజమాని కృష్ణారావును నమ్మించింది. దుకాణంలో 12.89 గ్రాముల బంగారం తీసుకున్నది. ఆన్లైన్ యాప్‌ల ద్వారా డబ్బు పంపిస్తున్నట్టు బురిడీ కొట్టించి దుకాణ యజమానికి రూ.75 వేల నకిలీ చెక్కు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నది. యజమాని చెక్కు డ్రా చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లగా ఆ చెక్కు నకిలీదని తేల్చారు. కంగుతిన్న బాధితుడు గురువారం రాత్రి త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. చెక్కు, మొబైల్ నంబర్ల ఆధారంగా కి‘లేడి’ ఆచూకీ తెలుసుకున్నారు. ఆమె ములకలపల్లి మండలం చాప్రాలపల్లికి చెందిన బానోతు సరితగా గుర్తించారు. నిందితురాలు ఆ బంగారాన్ని ఓ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి రూ.50 వేల సొమ్ము తీసుకున్నట్టుగా విచారణలో తేలింది. పోలీసులు బంగారాన్ని రికవరీ చేసి, నిందితురాలిని అరెస్ట్ చేశారు.