మధిర, నవంబర్ 8 : సీపీఎం నేత సామినేని రామారావు హత్య జరిగి పది రోజులైనా హంతకులను పట్టుకోలేని దద్దమ్మ సర్కార్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో ఇటీవల హత్యకు గురైన సీపీఎం నేత సామినేని రామారావు సంస్మరణ సభ మధిర నియోజకవర్గ సీపీఎం కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అధ్యక్షతన శనివారం జరిగింది. రామారావు చిత్రపటానికి బీవీ రాఘవులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఏపీ సీపీఎం కార్యవర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేమని భావించి, రామారావును హతమార్చారని ఆరోపించారు. హంతకులను ఎందుకు పట్టుకోవడం లేదో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పరిపాలన చేయడం లేదని విమర్శించారు.