హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం సిటీ, నవంబర్ 17 : రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్నది. పలుచోట్ల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు, కొందరు అధ్యాపకుల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇప్పటికే వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోగా, తాజాగా ఖమ్మం, నల్లగొండ మెడికల్ కళాశాలల్లో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (కేజీఎంసీ)లో ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన సంచలనంగా మారింది. యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెహమాన్ నిర్వాకం కాలేజీ ప్రతిష్ఠకే మచ్చ తెచ్చిపెట్టింది. ములుగుకు చెందిన వివేక్ కేజీఎంసీలో అడ్మిషన్ పొందాడు. తరగతులు ప్రారంభంకావడంతో తనకు నచ్చిన కటింగ్ చేయించుకొని వచ్చాడు. కాలేజీలో సెకండియర్ విద్యార్థులు కొందరు అతడిని పిలిచి కటింగ్ సరిచేసుకోవాలని ఆదేశించారు. సీనియర్ల ఆదేశానుసారం అతడు మళ్లీ కటింగ్ సరిచేసుకుని వచ్చాడు.
కానీ సంతృప్తి చెందని యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రెహమాన్.. ఎంబీబీఎస్ స్టూడెంట్ను సెలూన్ షాపునకు స్వయంగా తీసుకెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై ఇద్దరినీ పిలిపించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు విచారించారు. విద్యార్థికి గుండు కొట్టించిన విషయం వాస్తవమేనని అసిస్టెంట్ ప్రొఫెసర్ అంగీకరించారు. దీంతో ఆయనను హాస్టల్ బాధ్యతల నుంచి తప్పించారు. ఇదే సమయంలో ఫస్టియర్ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధించి గుండు కొట్టించారన్న ఆరోపణలు బయటికి పొక్కడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ సహా మరికొన్ని సంఘాల నేతలు కేజీఎంసీ ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులతోపాటు గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేజీఎంసీ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. విద్యార్థి కొర్రా వివేక్రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్టు సీఐ ఉదయ్‌కుమార్ మీడియాకు తెలిపారు.
నల్లగొండ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినులపై ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు వైద్య విద్యార్థులు, ఒక జూనియ ర్ డాక్టర్‌ను అధికారులు శనివారం సస్పెం డ్ చేసినట్టు తెలిసింది. బాధ్యులైన సెకండియర్ విద్యార్థికి ఒక నెల, ఇద్దరు ఫైనలియర్ విద్యార్థులను ఆరు నెలలు, జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్టు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే నెల మొదటివారంలో మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థులను సెకండియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటంతో 10 మందిని సస్పెండ్ చేశారు. నెల రోజులపాటు తరగతులకు హాజరుకాకుండా వారిపై నిషేధం విధించారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కానీ, డీఎంఈ గానీ, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగానీ ఈ అంశంపై దృష్టిపెట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు వారాలుగా వరుస ర్యాగింగ్ ఘటనలు వెలుగుచూస్తున్నా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించనేలేదు. తాజాగా మూడు కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు బయటకొచ్చి, పరువు పోయిన తర్వాత మేల్కొన్నారు. ఆదివారం ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులతో ర్యాగింగ్ ఘటనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని ఆదేశించారు.