సికింద్రాబాద్, నవంబర్18: లగచర్ల ఘటనపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం గ్రామంలో నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తుందని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవనాయక్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో జరిగిన వివిధ గిరిజన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కమిటీ గ్రామంలో పర్యటించి, వాస్తవ విషయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ఈ కమిటీలో మేధావులు ఉంటారని తెలిపారు. లగచర్లలో అధికారులపై దాడి అనంతరం గిరిజనులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి, కొందరి అరెస్టు చూపకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్, ఆలిండియా బంజారా ప్రొఫెసర్ల సేవా సంఘం అధ్యక్షుడు చంద్రునాయక్, స్టార్స్ టీం అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్‌లాల్, నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్, బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగ కార్యదర్శి శ్రీనునాయక్, రాజు రాథోడ్, వినోద్‌నాయక్, నవీన్, జాదవ్నాయక్, నవీన్ నాయక్, ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.