హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్థాన్.. అంతర్జాతీయంగా తన పరువు కాపాడేందుకు భారత్‌పై అసత్యాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. తాము భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించింది. వాటిలో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు, ఒక ఎస్‌యూ 30, ఒక మిగ్ 29 ఉన్నాయని ప్రచారం చేసింది. అయితే ఈ విషయంలో పాక్ ప్రభుత్వాధినేతలు, సైనికాధికారుల మధ్య ఏకాభిప్రాయం కనిపించలేదు.
తాము కనీసం రెండు విమానాలను కూల్చేశామని ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించగా, ఆరు విమానాలను కూల్చేశామని పాక్ ఆర్మీ ఆ దేశ మీడియాకు లీకులు ఇచ్చింది. భారత్ తమపై 75-80 విమానాలతో దాడులు చేసిందని, అందులో ఐదింటిని కూల్చేశామని పాక్ ప్రధాని పార్లమెంట్లో చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి పాక్ ప్రభుత్వం బలమైన ఒక్కఆధారం కూడా చూపలేదు. కేవలం ఒక యుద్ధ విమానం రెక్కలోని ఒక భాగం ఫొటోను చూపుతూ, పాంపోర్ జిల్లాలో కూలిపోయిన భారత యుద్ధవిమాన శకలం అని ప్రచారం చేస్తున్నది. ఒక విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్న వీడియోను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది.
అయితే ఇది 2021లో కూలిపోయిన మిగ్ 29 విమానానికి సంబంధించిన వీడియో అని భారత సైన్యం ఆధారాలతో సహా బయటపెట్టింది. మరోవైపు.. పాక్ చేసి న ఈ దుష్ప్రచారంతో చైనాకు చెందిన కంపె నీ లాభపడటం విశేషం. చైనాకు చెందిన జే-10, జేఎఫ్-17 విమానాల సాయంతో నే భారత యుద్ధ విమానాలను కూల్చేసిన ట్టు పాక్ ప్రచారం చేసింది. దీంతో ఈ విమానాలను తయారు చేస్తున్న చైనా కంపెనీ ‘చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్’ (సీఏసీ) షేర్ల ధరలు బుధవారం ఒక్కరోజే 18 శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.