హైదరాబాద్: రాష్ట్రంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాంబులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల కంటికి గాయాలైన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో బాధితులు హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖాన (Sarojini Devi Eye Hospital) వద్ద బారులు తీరారు. ఇప్పటివరకు 50 మంది గాయాలతో హాస్పిటల్కు వచ్చారు. వారిలో 34 మందికి స్వల్పంగా గాయాలవగా, మరో 9 మందికి సీరియస్గా ఉందని వైద్యులు వెల్లడించారు. వారందరికి చికిత్సం అందిస్తున్నట్లు చెప్పారు.
దీపావళి పటాకులు కాలుస్తూ 50 మంది గాయపడి సరోజినీ దవాఖానకు చికిత్స కోసం వచ్చారని డాక్టర్ సౌమ్య అన్నారు. ఇందులో 9 మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. వారిని అబ్జర్వేషన్లో పెట్టామని చెప్పారు. గురువారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఓపీ ద్వారా 50 మంది చికిత్స కోసం వచ్చారని తెలిపారు. వారిలో 34 మందికి స్వల్ప గాయలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిలో 35 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి క్షతగాత్రుల సంఖ్య తగ్గిందన్నారు.