హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ): ‘చైనా సైన్యంతో తలపడలేం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ చేతులెత్తేశారు. దూకుడు తగ్గేదేలే అన్నట్టుంది చైనా. దేశ భద్రతకు, భవిషత్తుకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి. రాజనీతి శాస్త్రవేత్త అయిన మహంతి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని డెవలపింగ్ కంట్రీస్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. భారత్-చైనా సంబంధాలు, చైనా అంతర్జాతీయ రాజకీయాల గురించి అనేక పుస్తకాలు రాశారు. దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక తాజా పరిస్థితులను విశ్లేషించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
జై శంకర్ తెలివైన వారు. ‘చైనా, భారత్‌కంటే బలమైన ఆర్థిక వ్యవస్థ. కాబట్టి మన సైన్యం చైనాతో యుద్ధం చేయలేదు’ అని అతని పరిస్థితి తనని అలా మాట్లాడిస్తున్నది. ఒక పొరుగు దేశంతో తలపడాలంటే ఆర్థిక స్థిరత్వం, అంతర్గత భద్రత, సుస్థిరత ఉండాలి. ఇప్పుడు జై శంకర్ ఇలా మాట్లాడటానికి కారణం.. దేశంలో అంతర్గత భద్రత, సుస్థిరత, ఆర్థిక స్థిరత్వం బాగా లేకపోవడమే. అందుకే చైనా దూకుడుగా ఉన్నది.
మోదీ హయాంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్నది. భారత సైన్యం వెనక్కు తగ్గుతున్నది. అందువల్ల చైనా, భారత భూభాగాలను ఆక్రమిస్తున్నది. సరిహద్దు ఉద్రిక్తతలు భారతదేశాన్ని మిలటరీ స్టేట్, కమ్యూనల్ నేషనలిజం వైపునకు నడిపించే ప్రమాదం ఉన్నది.
జీ 20లో దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ప్రపంచాన్ని పీడిస్తున్న సామాజిక ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు ఒప్పందాలేవీ జరగలేదు. అది ఒక మంచి ప్రచారానికి వాడుకుంటున్నారే తప్ప ఒక విజయవంతమైన విదేశీ విధాన రూపకల్పనకు, ఫలవంతమైన చర్చలకు వేదికగా మలచలేకపోయారు.
దిక్కుతోచని స్థితిలో, ఉద్యోగాలు కల్పించలేదనే విమర్శల ఒత్తిడిలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పథకం దేశానికి ఉపయోగపడదు. ఇది శిక్షణా కాదు. అలాగని ఉద్యోగమూ కాదు. యువత, పార్టీలు అగ్నివీర్ పద్ధతిని విమర్శించడం సరైనదే.
భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. గ్రామీణ పరిశ్రమలు బాగా వెనుకబడ్డాయి. చాలా మూతపడ్డాయి. వాటిని అభివృద్ధి పథంలో నడపాలి. గ్రామాలు బాగుపడకుండా దేశం అభివృద్ధి చెందలేదు.
సోషల్ క్యాపిటల్, కల్చరల్ క్యాపిటల్, ఫైనాన్స్ క్యాపిటల్ బీజేపీ బలం. సంస్కృతి, మతతత్వం, టెక్నాలజీ, డబ్బు, అణచివేత బీజేపీ ఆయుధాలు. సాంస్కృతికమైన ఉద్వేగాలు, సామాజిక ఉద్రిక్తతలను పెంచటం, ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చుతున్నది. అతిపెద్ద అర్థిక వ్యవస్థ, సూపర్ పవర్ వంటి నినాదాలతో మధ్య తరగతిని మాయ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ మాయోపాయాలే బీజేపీ బలం.
బిగ్ ఎకానమీ, సూపర్ పవర్ లాంటి మోసపూరితమైన నినాదాలకు మధ్యతరగతిని వాడుకోకుండా చూసుకోవాలి. వనరుల వినియోగం, దేశ సంపద పంపిణీ గురించి ప్రజలే నిర్దేశించేలా చర్చలు నిర్వహించాలి. అధిక ధరలు, పేదరికం, నిరుద్యోగం, దళితులపై దాడులు, ఆదివాసీ హక్కుల ఉల్లంఘనలు, కుల సమస్య, లింగవివక్ష వంటి సమస్యలన్నింటినీ కిందిస్థాయిలో చర్చకు తీసుకురావాలి. దేశం కోసం – ధర్మం కోసం, హిందూరాష్ట్ర పేరిట జరిగే రాజకీయాల వల్ల నష్టపోతున్న వాళ్లలో హిందువులే ఎక్కువ. కాబట్టి హిందువులే స్పందించి బీజేపీని ప్రశ్నించాలి.
ప్రతిపక్షాల ఐక్యకూటమి ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చు. కానీ ఎన్నికల్లో ఓడించడం ద్వారానే బీజేపీని ఎదుర్కోలేరు. నయా ఉదారవాదం అన్ని పార్టీల్లో ఉన్నది. క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యతిరేక ఉద్యమ నిర్మాణం జరగాలి. ఈ నిర్మాణం గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి దాకా జరగాలి. ఈ మార్పు వస్తేనే బీజేపీని అడ్డుకోగలం. యువత శక్తిసామర్థ్యాలను మతతత్వం వాడుకోవాలని చూస్తున్నది. దీనికి అడ్డుకట్టపడాలి.
ఒక విజయవంతమైన విదేశీ విధానం ఉండాలంటే అందుకు తగ్గట్టుగా దేశీయ పాలనా విధానాలు ఉండాలి. వాటికి ప్రజామోదం కూడా ఉండాలి. సైనిక వ్యూహాలు, విదేశీ విధానాలను దేశ పరిస్థితులు, పాలనా విధానాలతో సమన్వయం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది.
బీజేపీ బలం వల్ల, ప్రతిపక్షాల బలహీనత వల్ల మోదీ ప్రభుత్వానికి విజయాలు చేకూరడం అవాస్తవం. గ్లోబల్ ఫైనాన్స్ క్యాపిటల్, నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ ఒక్కటయ్యాయి. క్రోనీ క్యాపిటలిజం (ప్రభుత్వాల సహకారంతో లాభాలు పొందే పెట్టుబడిదారీ వ్యవస్థ) అనుసరిస్తుండటం వల్లే అంతర్జాతీయ పెట్టుబడిదారులు మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. అమెరికా, ఇతర అంతర్జాతీయ శక్తుల మద్దతు కూడా మోదీకి ఉన్నది. కాబట్టే వాళ్లు గెలవగలుగుతున్నారు. క్రోనీ క్యాపిటలిస్టులు కొంతమందిని డబ్బుతో లోబరుచుకుంటారు. ప్రశ్నించినవాళ్లను భయపెడతారు, జైళ్లలో పెడతారు, అణచివేస్తారు. అసరమైతే చంపడానికీ వెనుకాడరు. ఇప్పుడు కేంద్ర నిఘా, విచారణ సంస్థల దాడులన్నీ ఇందులో భాగమే.