మందమర్రి, జూలై 9: సింగరేణి ఏరియాలోని భూముల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 76 గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని విప్ నివాసంలో మున్సిపల్, సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఆర్కే 4 గడ్డ, శాంతినగర్, వల్లభాయ్నగర్, నాగార్జున కాలనీ, ప్రగతినగర్, రాజీవ్‌నగర్, ఠాగూర్‌నగర్, రామ్‌నగర్, భగత్‌సింగ్ నగర్, గంగాకాలనీ, సూపర్‌బజార్ ఏరియా, దుర్గారావు మార్కెట్, గీతామందిర్ ఏరియాల్లో మిస్సయిన ఇండ్లతోపాటు సింగరేణి క్వార్టర్ల మధ్య నివాసం ఉంటున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. మందమర్రి, రామకృష్ణాపూర్లో ఖాళీగా ఉన్న 1,600 సింగరేణి క్వార్టర్లను రిటైర్డ్ కార్మికులకు కేటాయించగా, మిగిలిన వాటిని పేద ప్రజలకు అందించేందుకు రెవెన్యూ శాఖకు అప్పగించాలని బాల్క సుమన్ కోరారు.