Rajiv Yuva Vikasam | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ‘రాజీవ్ యువ వికాసం’లో అక్రమాలకు తెరలేస్తున్నదా? ఎస్సీ కార్పొరేషన్లో ఒక కీలకనేతతోపాటు మరో అధికారి కలిసి చక్రం తిప్పుతున్నారా? ఇష్టానుసారం నిబంధనలు మార్చేస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. రాజీవ్ యువ వికాస పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన సబ్సిడీ రుణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,27,584 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి 3,500 యూనిట్ల చొప్పున మొత్తంగా 4,16,500 యూనిట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఎస్సీ కార్పొరేషన్ తుంగలో తొక్కుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయిలో అర్హులను ఎంపిక చేసి, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ, తుదకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈ ప్రక్రియను పక్కన పెట్టేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు అందజేసిన జాబితాను ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేకంగా పంపినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆ జాబితాలో తాము టిక్ చేసిన వారినే ఎంపిక చేయాలంటూ ప్రత్యేకంగా ఆదేశించారని జిల్లా స్థాయి కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు.
యూనిట్ల ఎంపిక విషయంలోనూ అధికారిదే పెత్తనం
వాస్తవానికి, సబ్సిడీ రుణాలకు సంబంధించిన యూనిట్ల ఎంపికలో లబ్ధిదారుడిదే తుది నిర్ణయంగా ఉంటుంది. అర్హులైన వ్యక్తులకు రుణం మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం తొలుత ప్రొసీడింగ్స్ మంజూరు చేస్తుంది. సదరు లబ్ధిదారుతో బ్యాంకు రెండు అకౌంట్లను అంటే ఒకటి నాన్ ఆపరేటివ్, మరొకటి లోన్ అకౌంట్‌ను తెరిపిస్తుంది. ఆ తరువాత సదరు లబ్ధిదారు తాను ఎంచుకునే యూనిట్‌కు సంబంధించిన కొటేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
అప్పుడు బ్యాంకు అధికారులు ఆ యూనిట్‌కు నగదును విడుదల చేసి, లబ్ధిదారుడితో యూనిట్ గ్రౌండింగ్ చేయిస్తారు. ఇదీ ప్రక్రియ. కానీ, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఆ ప్రక్రియనే పక్కదోవపట్టిస్తున్నది. మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్నది. కార్పొరేషనే యానిమల్ హస్బెండరీ, ఆటోమొబైల్, కిరాణ తదితర కొన్ని యూనిట్లను ఎంపిక చేస్తున్నది. తాము ఎంపిక చేసిన యూనిట్నే తీసుకోవాలని, అదీ తాము చెప్పిన చోటు నుంచే కొటేషన్ తేవాలని, మెటీరియల్‌ను కూడా అక్కడే తీసుకోవాలంటూ నిబంధనలు విధిస్తున్నది. ఆ మేరకు లబ్ధిదారుల నుంచి ప్రతిపాదనలను పంపాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.
తెరవెనుక కార్పొరేషన్ ఉన్నతాధికారి!
ఎస్సీ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ తతంగం వెనక కార్పొరేషన్‌లోని కీలక నేతతోపాటు ఒక ఉన్నతాధికారి ఉన్నారని, వీరిద్దరూ కలిసి కార్పొరేషన్ ఎండీని సైతం పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ అండదండలతో సదరు ఉన్నతాధికారి ఇష్టారీతిన నిబంధనలను మార్చేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పాడిపరిశ్రమ వ్యాపారితోపాటు స్థానికంగా ఉన్న పలు సెంట్రింగ్, కిరాణ షాపు లు, ఆటోమొబైల్ కంపెనీలతో ముందస్తుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని, వారి నుంచే కొటేషన్లు తెప్పించాలని, వారికే నిధులను చెల్లించేలా అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఈ వ్యవహారన్నంతా కార్పొరేషన్‌లోని సదరు ఉన్నతాధికారే చక్కబెడుతున్నారని అధికారులు బాహాటంగానే చర్చి ంచుకుంటున్నారు. ఇప్పటికే యూనిట్లకు సంబంధించిన కంపెనీలను ఫైనల్ చేయడమేగాక, క్షేత్రస్థాయి అధికారులకు సైతం వాటి నుంచే కొటేషన్లు తెప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు అధికారులు కోరుతున్నారు.