అడ్డగూడూరు, నవంబర్ 11: వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలింది. అదే ఇంట్లో ఉన్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. కోటమర్తికి చెందిన పాశం యాదగిరి (42), తల్లి సోమమ్మతో కలిసి ఇంట్లో ఉంటున్నాడు. యాదగిరికి వివాహం కాలేదు.
మద్యానికి బానిసై రోజూ తాగి వస్తుంటాడు. దాంతో తల్లి రోజూ పక్కవారింట్లో నిద్రిస్తుంటుంది. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన యాదగిరి నిద్రపోయాడు. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంటి గోడతోపాటు కొంత భాగం ధ్వంసమైంది. మంటలు అంటుకోవడంతో యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు.