వేములవాడ, డిసెంబర్ 1: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడింది. రాజన్న ఆలయాన్ని రూ.150కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా 30 అడుగుల లోతువరకు రంధ్రాలు తవ్వి అప్పటికప్పుడే కాంక్రీట్‌తో పైల్ పిల్లర్లు నిర్మించేందుకు చెన్నై నుంచి భారీ హైడ్రాలిక్ యంత్రాన్ని రప్పించి పనులు ప్రారంభించారు. ఆలయ దక్షిణ ప్రాకారం విస్తరణ పనుల కోసం రోడ్డుపై హైడ్రాలిక్ యంత్రంతో పైల్స్ పిల్లర్ల నిర్మాణానికి యత్నించే క్రమంలో భూమికి కొద్ది అడుగుల లోతులోనే రాళ్లు అడ్డుగా రావడం, ఇంకొన్నిచోట్ల భూమి లోపలి భాగం బలంగా లేకపోవడం, కొన్నిచోట్ల 30 అడుగుల కన్నా ఎకువ లోతుకు వెళ్లాల్సి రావడంతో పైల్ నిర్మాణం సాధ్యం కాదని సిబ్బంది స్పష్టం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి సాయిల్ మెకానిక్, ఇతర నిపుణులను రప్పించి పరిశీలించగా భూమి లోపల భాగంలో ఉన్న తేడాల వల్ల హైడ్రాలిక్ యంత్రంతో కాకుండా ఓపెన్ విధానంలో తవ్వి, ఫుటింగ్ వేసి పిల్లర్లు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు ఇన్చార్జి కలెక్టర్, వీటీడీఏ వైస్ చైర్మన్ గరిమా అగర్వాల్‌ను కలిసి సాంకేతికపరమైన ఇబ్బందులను వివరించినట్టు తెలిసింది. దీంతో పనులను తాతాలికంగా నిలిపివేసి హైడ్రాలిక్ యంత్రాన్ని వెనకి పంపించాలని నిర్ణయించారు.