హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైన ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకర్గ పరిధిలో ముదిరాజ్ సామాజికవర్గ జనాభా అత్యధికంగా ఉండటంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇదే సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే మంత్రివర్గంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావుకు ప్రాతినిధ్యం ఉంది. సీఎం రేవంత్ కూడా ఇదే జిల్లాకు చెందినవారు. అయినప్పటికీ మరొకరికి ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు సీఎం స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ బెర్త్ కోసం పైరవీలు ఊపందుకున్నట్టు తెలిసింది.
పార్లమెంట్ ఫలితాలతో ముడిపడి
ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యర్థితో సరిసమానంగా ఓట్లు వచ్చి, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో భారీ మెజార్టీ సాధించడం వల్ల పార్టీ విజయానికి కారణం అయితే అలాంటి చోట సదరు ఎమ్మెల్యే కృషికి ప్రతిఫలంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నది అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్టు తెలిసింది. పార్లమెంట్ ఫలితం ఆధారంగా ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో అవకాశాలు ఉంటాయని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకే అవకాశం ఉంటుందని చెప్పలేమని విశ్లేషిస్తున్నారు.
ప్రాతినిధ్యం లేని జిల్లాలు
ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మంత్రి పదవుల సంఖ్య ఖరారు అవుతుంది. ఈ లెక్కన తెలంగాణలో సీఎంతో కలుపుకొని మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మందికి అవకాశం లభించింది. మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించని ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఈ జిల్లాను మినహాయిస్తే మిగిలేది ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి పదవి ఆశిస్తుండగా, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కూడా మంత్రి పదవిపై కన్నేశారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని సీం పేర్కొన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కోటాలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డికి మంత్రిపదవి ఖాయమని బలంగా వినిపిస్తోంది. ఓసీ కోటాలో మరొకరికి అవకాశం లేకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఓసీ కోటాలో నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డికి అవకాశం కల్పించే పక్షంలో మల్రెడ్డ్డికి మంత్రిపదవి దక్కే అవకాశం దాదాపు లేనట్టేనని చెప్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంతో కలుపుకొని నలుగురికి అవకాశం లభించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తే, ఒకే సామాజిక వర్గం నుంచి ఐదుగురికి అవకాశం కల్పించినట్టు అవుతుంది.
హైదరాబాద్ నుంచి ఎవరికి?
గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇక్కడి నుంచి మంత్రి అయ్యే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరికే మంత్రి పదవి లభించే అవకాశం ఉందని అంచనా. ఎస్టీ కోటాలో మంత్రివర్గంలో ఇప్పటికే సీతక్క కొనసాగుతుండడంతో లంబాడ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ మంత్రివర్గంలో ఉండటం, ప్రసాద్‌రావు స్పీకర్‌గా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వీరి జనాభా ప్రాతిపదికన మరొకరికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని సమాచారం. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న విమర్శల నేపథ్యంలో ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నప్పటికీ అది ఎవరన్న దానిపై పార్టీలో ఇంకా క్లారిటీ లేదు.
మైనార్టీకి అవకాశం లేనట్టే?
కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో మైనార్టీల (ముస్లీం) నుంచి ఎవరూ విజయం సాధించకపోవడంతో మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓటమి పాలుకావడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. నాంపల్లి నుంచి ఓటమిపాలైన ఫిరోజ్‌ఖాన్ హైదరాబాద్ నగరం కోటాలో తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని ఆశలు పెట్టుకున్నారు.