e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home Top Slides Krishna River : చెన్నై ముసుగులో పెన్నాకు నీళ్లు

Krishna River : చెన్నై ముసుగులో పెన్నాకు నీళ్లు

  • కృష్ణానీటిని అక్రమంగా తరలిస్తున్న ఏపీ
  • పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రాజెక్టుల విస్తరణ
  • రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించకుండా అడ్డంకులు
  • కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ

హైదరాబాద్‌, ఆగస్ట్‌5 (నమస్తే తెలంగాణ): మానవత్వం మాటున ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను బేసిన్‌ అవతలిప్రాంతాలకు తరలిస్తున్నదని తెలంగాణ సర్కార్‌ తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ పలు ప్రాజెక్టులను విస్తరిస్తున్నదని, ఆ పనులను వెంటనే నిలువరించాలని కేఆర్‌ఎంబీని డిమాండ్‌ చేసింది. గురువారం కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. శ్రీశైలం రిజర్వాయర్‌ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టు మాత్రమేనని.. బచావత్‌ ట్రిబ్యునల్‌ సైతం దానిని ఆ విధంగానే పరిగణిస్తూ.. ఏపీకి సాగునీటి కేటాయింపులు చేపట్టలేదని గుర్తుచేశారు. ఆవిరినష్టాల కింద కేవలం 33 టీఎంసీలు కేటాయించిందని వెల్లడించారు. కృష్ణానదికి దిగువన ఉన్న రాష్ట్రంగా ఏపీకి కేటాయించిన జలాలను రీ అలోకేషన్‌, రీ అడ్జస్ట్‌మెంట్‌పై ఎక్కడైనా వినియోగించుకోవచ్చనే స్వేచ్ఛను మాత్రమే ఇచ్చిందని, వాటిపై ఎలాంటి హక్కులనూ కల్పించలేదని స్పష్టంచేశారు. ఈ మిగులు జలాలపై ఆధారపడి ఎలాంటి ప్రాజెక్టులను నిర్మించవద్దని స్పష్టంగా తేల్చిచెప్పిందని.. కానీ, ట్రిబ్యునల్‌ ఇచ్చిన స్వేచ్ఛను అదనుగా చేసుకుని ఏపీ జలదోపిడీకి తెగబడుతున్నదని ఆరోపించారు. చెన్నై వాసుల తాగునీటి అవసరాలకు కేటాయించిన 15 టీఎంసీలను కూడా సరఫరా చేయడం లేదని.. 2019-20లో 179 టీఎంసీలు తరలిస్తే అందులో చెన్నైకి ఇచ్చినవి 10 టీఎంసీలకు మించి లేవని లెక్కలతో సహా వివరించారు. అంతకు నాలుగింతల జలాలను ఎస్‌ఆర్బీసీ, కేసీ కెనాల్‌, నిప్పులవాగు, ఎస్కేప్‌ చానల్‌ద్వారా అక్రమంగా పెన్నాబేసిన్‌కు ఏపీ తరలించుకుపోతున్నదని పేర్కొన్నారు.

సాకులు చూపి అడ్డంకులు

అక్రమాలు వెలుగుచూస్తాయనే రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం సాకులు చూపుతూ ప్రాజెక్టు సందర్శనను అడ్డుకొంటున్నదని తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ గురువారం లేఖ రాశారు. ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై ఘాటుగా స్పందించారు. కేఆర్‌ఎంబీ గురువారం రాయలసీమ ప్రాజెక్టును సందర్శించాల్సి ఉండగా.. తనిఖీ బృందంపై ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం కేఆర్‌ఎంబీలో తెలుగు రాష్ర్టాలకు చెందిన వ్యక్తులెవరూ ఉండకూడదనే అంశాన్ని సాకుగా చూపుతూ ప్రాజెక్టు సందర్శనపై అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ సైతం ప్రాజెక్టు సందర్శనను వాయిదా వేసుకొన్నది. దీనిపై తెలంగాణ ఈఎన్సీ ఘాటుగా స్పందించారు. అక్రమాలు వెలుగుచూస్తాయనే కేఆర్‌ఎంబీ బృందం తనిఖీని ఏపీ అడ్డుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -

కేఆర్‌ఎంబీ బృందంలో తెలంగాణ ప్రాంతీయ నేపథ్యం ఉన్న సీడబ్ల్యూసీ ఇంజినీర్‌ దేవేందర్‌రావుపై ఏపీ అభ్యంతరం చేయడాన్ని ఈఎన్సీ మురళీధర్‌ తీవ్రంగా ఆక్షేపించారు. కేఆర్‌ఎంబీ నియమించింది ఏకసభ్య కమిటీ కాదని.. బృందంలో దేవేందర్‌రావుతో ఇతర సభ్యులు కూడా ఉన్నారని.. వారందరి పరిశీలన, నిర్ణయాల మేరకే నివేదిక ఉంటుందని పేర్కొన్నారు. కల్వకుర్తి పంప్‌హౌస్‌ల సందర్శనకు వచ్చిన బృందంలో ఏపీకి చెందిన సీడబ్యూసీ ఇంజినీర్‌, కేజీబీవో సీఈ ఎంకే శ్రీనివాస్‌ ఉన్నారని.. అయినప్పటికీ తాము అభ్యంతరం చెప్పలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేయడం వెనుక ఆంతర్యం వేరే ఉన్నదని.. సందర్శనను అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ వెంటనే ప్రాజెక్టును సందర్శించి, ఎన్జీటీ ఇచ్చిన గడువు ఆగస్టు 9లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ సర్కారు సూచించింది.

వెలిగొండ, తెలుగుగంగ విస్తరణను అడ్డుకోండి

వరద జలాల తరలింపుసాకుతో 2006లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ చేపట్టారని.. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రినీవా, వెలిగొండతోపాటు తదితర ప్రాజెక్టులను నిర్మించారని ఈఎన్సీ మురళీధర్‌ తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 880 అడుగుల మేర నిల్వ ఉంటేనే వరద నీటిని తరలించాల్సి ఉండగా.. ఏపీ సర్కారు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నీటిని పెన్నాబేసిన్‌కు యథేచ్ఛగా తరలిస్తున్నదని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలుమార్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారని, ఏపీ తీరును అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల్లోనే గట్టిగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. అనుమతుల్లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని కేంద్రం జారీచేసిన ఆదేశాలను సైతం ఏపీ తుంగలో తొక్కుతున్నదని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana