హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం 3,645 దేవాలయాల్లో అమలవుతున్న ధూప దీప నైవేథ్య పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరింపజేయాలని తెలంగాణ అర్చక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, దేవాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని కోరారు. శనివారం అరణ్యభవన్‌లో మంత్రిని కలిసిన అర్చక జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు పరాశరం రవీంద్రాచారి, దేవాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ తాండూరి కృష్ణమూర్తి, ముఖ్యకార్యదర్శి చింతంభట్ల బదరీనాథాచార్యులు, అగ్నిహోత్రం చంద్రశేఖరశర్మ, టీ రాజేశ్వరశర్మ తదితరులు తమ సమస్యలను వివరించారు. 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ 5,625 మంది అర్చక, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించి అమలుచేశారని, జీవో 121 ప్రకారం 2,667 మందికే ఈ రకమైన వేతనాలు అందుతున్నాయని, మిగిలినవారికీ వర్తింపజేయాలని కోరారు. అర్చక వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు, కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్వరాష్ట్రంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ ప్రతిష్ఠ పెరిగిందని, అర్చకులు, ఆలయ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. అర్చకుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.