హైదరాబాద్ : తెలంగాణతో పాటు యావత్ దేశంలో పేరెన్నికగన్న హైదరాబాద్ నుమాయిష్ కరీంనగర్లో తొలిసారిగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రి గంగులకమలాకర్, రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి నుమాయిష్ ఏర్పాటుపై చర్చించారు. 82 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటివరకూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ఈ ఎగ్జిబిషన్‌ను కరీంనగర్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్స్ వంటి అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో నిర్వహించాలని గతంలో నుమాయిష్ సభ్యులను మంత్రి గంగుల కోరారు. ఈ మేరకు ఇవాళ నుమాయిష్ సభ్యులు మంత్రిని, ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ కలిసి కరీంనగర్లో ఎగ్జిబిషన్ నిర్వహణపై చర్చించారు.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిషిని నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూర్తయిన తరువాత ప్రభుత్వ సహకారంతో కరీంనగర్ లో నిర్వహించడానికి ప్రతిపాదనపై చర్చించారు.ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభాశంకర్, సెక్రటరీ సాయినాథ్ దయాకర్, సభ్యులు వి. జయరాజ్ పాల్గొన్నారు.