హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ నిఘా కొరవడటంతో గంజాయి, ఎన్డీపీఎల్ స్మగ్లర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పోలీస్, ఎక్సైజ్‌శాఖల భయం లేకపోవడంతో ఏకంగా సిబ్బందిపైనే ఎదురుదాడులకు దిగుతున్నారు. అవసరమైతే తమకు అడ్డొచ్చిన వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇందుకు నిదర్శనమే నిజామాబాద్ జిల్లాలో విధుల్లో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో తొక్కించడం. గంజాయి స్మగ్లర్ల అనూహ్యదాడితో సౌమ్య ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుకునేందుకు, నాటుసారాను అరికట్టేందుకు, గంజాయి పట్టుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఎదురుదాడులు జరుగుతున్నాయని ఎక్సైజ్ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పుడు కొత్తగా వాహనాలతో తొక్కించి చంపే ప్రయత్నమూ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఐదు నెలలు గడిచినా చర్యలేవి?
సరిగ్గా 5 నెలల క్రితం ఎక్సైజ్ ఆఫీసుకు వచ్చిన మంత్రి జూపల్లి తన శాఖపై సమీక్ష చేస్తూ ఎక్సైజ్ సిబ్బందిపై నిందితులు ఎదురుదాడి చేస్తున్నారని, అందుకే వారికి ఆయుధాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పి 5 నెలలు గడిచినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తమకు ఆయుధాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దగ్గర ఆయుధాలు ఉండవనే ఆలోచనతో స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో నిరుడు పోలీసుశాఖ 2,542కు పైగా ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేస్తే, ఎక్సైజ్‌శాఖ 1,304 కేసుల్లో 5,505 కేజీల గంజాయి, 1,646 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 2025లో రికార్డు స్థాయిలో 11,500 లీటర్ల అక్రమ మద్యం, 8,766 లీటర్ల ఎన్‌డీపీఎల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
అన్ని టీములకూ ఆయుధాలివ్వాలి
రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలోని అన్ని ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు ఆయుధాలు తప్పనిసరిగా ఉండాలని ఎక్సైజ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లోని 4 టీములు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని 10 టీములు, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్‌లోని 34 టీములకు కలిపి సుమారు 150 నుంచి 200 వరకు ఆయుధాలు అవసరమవుతాయని చెప్తున్నారు. డ్రగ్స్, ఎన్డీపీఎల్, నాటుసారా యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికీ ఆయుధాలు కావాలని అంటున్నారు. అప్పుడే ఎక్సైజ్‌శాఖ అంటే అక్రమార్కులకు భయం ఉంటదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చే దిశగా ఆలోచనలు చేసి త్వరగా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.