హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25 పబ్బుల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. పలువురిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షించారు. కొందరి నుంచి శాంపిళ్లు సేకరించారు. వీకెండ్స్‌లో పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారం మేరకు సోదాలు చేశామని, ఎవరకీ పాజిటివ్ రాలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జాయింట్ డైరెక్టర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్ కిషన్, డీఎస్పీ తిరుపతి పాల్గొన్నారు.
బాలికపై బాలుడి లైంగికదాడి
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 25 : 16 ఏండ్ల బాలుడు.. 13ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కుమ్రంభీం జిల్లా కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. డీఎస్పీ సదయ్య కథనం ప్రకారం.. ఆసిఫాబాద్‌కు చెందిన ఓ బాలుడు మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఓ బాలికతో స్నేహం చేసి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఇటీవల వీడియోకాల్ చేసి నగ్నంగా కన్పిస్తూ మాట్లాడాలని కోరాడు. మొదట ఒప్పుకోని ఆ బాలిక తర్వాత అంగీకరించింది. ఆమె ఫోన్లో నగ్నంగా కన్పించగా స్క్రీన్ షాట్స్ తీశాడు. తరువాత ఆ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి లైంగికదాడి చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి 23న పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్, ఇన్చార్జి జువెనైల్ జస్టిస్ బోర్డు ఆసిఫాబాద్ కోర్టు ఎదుట హాజరుపర్చారు.