హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కల్తీమద్యం, నకిలీ మద్యం, పన్నులు చెల్లించని మద్యం, సారాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం వెల్లడించారు. దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని 30 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలు, గోదాములు, రైస్ మిల్లులో సోదాలు చేపడుతామని, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెడుతామని చెప్పారు. ఖరీదైన మద్యంలో, తక్కువ ధర కలిగిన మద్యం కలిపి అమ్మకాలు చేపట్టే వారిపై, కల్తీ మద్యం తయారుచేసే కేంద్రాలపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు. గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి దిగుమతి అయ్యే పన్నులు చెల్లించని, డిఫెన్స్ మద్యం రవాణా, అమ్మకాలపై దృష్టిసారించామని స్పష్టంచేశారు. వరంగల్, మహబూబాబాద్, అదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని సారా స్థావరాలపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ బృందాలను షానవాజ్ ఖాసీం అదేశించారు. పన్నులు చెల్లించని మద్యం విక్రయాలకు సంబంధించి 2014 నుంచి 2025 ఆగస్టు నాటికి 4,516 కేసుల నమోదు పెట్టి, 3,238 మందిని అరెస్ట్ చేశామని, సారా తయారీ, విక్రయాలకు సంబంధించి 2,75,028 కేసులు నమోదు చేసి, 1,59,974 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.