Drugs | హైదరాబాద్ : డ్రగ్స్‌ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ మేరకు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు సమర్థవంతంగా పని చేసి డ్రగ్స్‌ను కట్టడి చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రీ అదేశించారు. అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో శనివారం హైదారాబాద్ డివిజన్ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. డ్రగ్స్‌పై ఈ మధ్యకాలంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి..? ఎంత మందిని అరెస్టు చేశారనే విషయంపై చర్చంచారు.
ప్రధానంగా ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్తచట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని, నిందితులకు శిక్ష పడేవిధాంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో పక్క డ్రగ్స్ రవాణా, అమ్మకాలు, వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని, సమాచారం ఇవ్వడానికి అవసరమైన సోర్స్‌ను పెంచుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. మరోపక్క పెట్రోలింగ్ పెంచి డ్రగ్స్‌ను అరికట్టడంపై దృష్టి సారించాలన్నారు.
అనుమతి లేని స్థలాల్లో మద్యం సేవించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రాంతాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి పొందిన ఈవెంట్లలో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్‌తోపాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.