హైదరాబాద్, అక్టోబర్ 15 (హైదరాబాద్ ): రాష్ట్రంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదురుతున్నది. జీఎస్టీ, వ్యాట్ చెల్లింపులను ఎక్సైజ్ శాఖ ఎగవేస్తున్నదని వాణిజ్య పన్నుల శాఖ అభియోగాలు మోపుతుండగా.. మద్యం వ్యాపారం జీఎస్టీ పరిధిలో ఉండదని, చట్టం తెలియకుండానే తమకు నోటీసులు పంపుతున్నారా అంటూ ఎక్సైజ్‌శాఖ ఘాటుగా స్పందించినట్టు తెలిసింది. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) మద్యం బాటిళ్లపై అతికించే హోలోగ్రామ్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంపై జీఎస్టీ చెల్లించడం లేదని పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ జూన్‌లో నోటీసులు పంపింది. ఒక్కో హోలోగ్రామ్‌కు 30 పైసల చొప్పున ఇప్పటివరకు రూ.302.98 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్టు నోటీసుల్లో పేర్కొంది. ఈ మొత్తం మీద 18 శాతం చొప్పున రూ.54.53 కోట్లు జీఎస్టీ చెల్లించాలని తెలిపింది. ఇది కాకుండా.. టీఎస్‌బీసీఎల్ మద్యం అమ్మకాలపై రూ.400 కోట్ల వ్యాట్ ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ వాణిజ్యపన్నుల శాఖ ఎక్సైజ్ కమిషనర్‌కు మరో నోటీసు పంపింది. మద్యం దుకాణాల ద్వారా విక్రయించే ఎమ్మార్పీ మీద 18 శాతం జీఎస్టీ చెల్లించాలని పేర్కొన్నది. లేనిపక్షంతో చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఘాటుగా స్పందించిన ఈ నోటీసులపై ఎక్సైజ్‌శాఖ ఘాటుగా స్పందించినట్టు తెలిసింది. మద్యం వ్యాపారం జీఎస్టీ పరిధిలో లేదని.. ఈ వ్యాపార లావాదేవీలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)నే వసూలు చేస్తామని, ఆ సొమ్మంతా నేరుగా ఆర్థిక శాఖ ఖాతాలోకి జమ అవుతుందని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. వైన్ షాపుల నుంచి పన్ను వసూలు చేసుకొని ప్రభుత్వానికి చెల్లించే వెసులుబాటు బేవరేజస్ కార్పొరేషన్‌కు వ్యాట్ చట్టం కల్పించిందని వివరిస్తూ.. చట్టం తెలియకుండానే నోటీసులు పంపుతున్నారా అంటూ ఘాటుగానే జవాబు రాసినట్టు తెలిసింది. ఎక్సైజ్ శాఖ జవాబుతో సంతృప్తి చెందని వాణిజ్య శాఖ సంబంధిత అధికారుల మీద కేసులు నమోదు చేయటం కోసం న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.
మాకు కూడా వాటా:సీజీఎస్టీ
తాజాగా ఈ వివాదంలోకి కేంద్ర జీఎస్టీ విభాగం కూడా తలదూర్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తమకు కూడా పంపాలని కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) విభాగం ఇటీవల రాష్ట్ర జీఎస్టీ శాఖకు లేఖ రాసినట్టు చెప్తున్నారు. ఎక్సైజ్‌శాఖ ఆదాయంలో తమకు కూడా వాటా వస్తుందని, హోలోగ్రామ్ సీజీఎస్టీ కింద రూ.27 కోట్లు, మద్యం ఎమ్మార్పీలో సీజీఎస్టీ కింద రూ.200 కోట్లు మొత్తం రూ.227 కోట్ల వాటా తమకు రావాలని ఆ లేఖలో పేర్కొనట్టు విశ్వసనీయంగా తెలసింది.