హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాజమాన్యం విద్యార్థుల నుంచి నాలుగేండ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజు వసూలు చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,091 మంది బీ క్యాటగిరీ విద్యార్థుల నుంచి రూ.11,50,000, 872 మంది సీ క్యాటగిరీకి చెందిన విద్యార్థుల నుంచి రూ.23 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేఎన్ఆర్ యుహెచ్ఎస్ రిజిస్ట్రార్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు అధిక ఫీజులు వసూలు చేయరాదని సర్యులర్ జారీ చేసినా యాజమాన్యాలు యథావిధిగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని, అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.