కోదాడ రూరల్, డిసెంబర్ 4: ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు.. అడ్డుకున్న రైతులపై దాడికి పాల్పడ్డారు. పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించిన భూమిలో పెద్దఎత్తున తవ్వకాలు జరిపి మట్టిని తరలించేందుకు వంతెన కూడా నిర్మించడం గమనార్హం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు శివారులోని 229 సర్వే నంబర్లో పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన భూమిపై రియల్ వ్యాపారులు కన్నేశారు. తొగర్రాయి గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు డ్రైవర్ ధర్మపురి శ్రీనివాసాచారి ఎన్ఎస్పీ 49ఆర్ కాల్వపై గూనలతో వంతెన నిర్మించి మట్టిని తరలిస్తుండగా శుక్రవారం సమీప రైతులు అడ్డుకున్నారు. ఆర్ఐ కల్యాణి అక్కడికి వెళ్లి విచారణ జరుపుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. రాళ్లు రువ్వుకోవడంతో రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు లారీని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం శనివారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు.