హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : పరీక్షల టెన్షన్ బారినపడుతున్న విద్యార్థులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. 2024 సంవత్సరంలో ఏకంగా లక్ష మందికిపైగా విద్యార్థులు టెన్షన్ బారినపడ్డారు. ఈ లక్ష మంది వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న టోల్ ఫ్రీ నంబర్ అయిన ‘టెలిమానస్’ను ఆశ్రయించారు. దేశంలో ఒక్క తెలంగాణ నుంచి టెలిమానస్‌కు కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. భయమేస్తుందంటూ.. టెన్షన్ పీడిస్తుందంటూ విద్యార్థులు ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదిస్తున్నారు. ఆందోళన కలిగించే ఈ గణాంకాలను విద్యార్థుల మానసిక ఆరోగ్యం-ఆత్మహత్యల నివారణపై సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. ఈ టాస్క్‌ఫోర్స్ మధ్యంతర నివేదికను ఇటీవలే సమర్పించింది. 2024 సంవత్సరంలో దేశంలో 3.6 లక్షల విద్యార్థులు టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్‌ను ఆశ్రయించగా, వీరిలో తెలంగాణ నుంచే లక్ష మంది విద్యార్థులున్నట్టు నివేదిక వెల్లడించింది.
ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలతో ఆత్మహత్యలు చేసుకొనే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2025 ఆగస్టు వరకు జాతీయంగా ఏకంగా 210 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. 117 మంది అబ్బాయిలుండగా, 93 మంది అమ్మాయిలు ఉన్నారు. యాజమాన్యాలవారీగా తీసుకొంటే ప్రభు త్వ కాలేజీల్లో 82, ప్రైవేట్ కాలేజీల్లో 79, ఇతర విద్యాసంస్థల్లో 49 మంది ప్రాణాలు తీసుకొన్నారు. బిట్స్ పిలానీ గోవా, ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఐదుగురు చొప్పున, 47 మంది మెడికల్ విద్యార్థులు ప్రాణాలు తీసుకొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు 24, ఎండీ, ఎంఎస్ విద్యార్థులు 11 మంది చొప్పున ఆత్మహత్యలు చేసుకొన్నారు.