నారాయణఖేడ్, జూన్ 9: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కే)లో దుండగులు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మాజీ సర్పంచ్ పార్శెట్టి సంగమ్మ భర్త సంగప్ప కథనం ప్రకారం.. చాప్టా(కే)లో శనివారం రాత్రి 11 గంటలకు నలుగురు వ్యక్తులు సంగమ్మ ఇంటిపైకి ఎక్కి లోనికి చొరబడ్డారు. నిద్రిస్తున్న సంగప్పను బెదిరింపులకు గురిచేశారు. ‘ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తావా?’ అంటూ వీరంగం సృష్టించడంతోపాటు ఇంట్లోని సిలిండర్, టేబుల్‌ను కింద పడేశారు. గది తలుపులు తొలిగించే ప్రయత్నం చేశారు. సంగప్ప గట్టిగా అరుస్తూ వారిపై తిరగబడటంతో పారిపోయారు. ఈ సందర్భంగా సంగప్ప మాట్లాడుతూ.. నలుగురిలో ముగ్గురు ముఖానికి మాస్క్ తొడుక్కొని ఉన్నారని, ఒకరిని మాత్రం గుర్తించినట్టు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సంగప్ప తెలిపారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల పనేనని ఆయన అనుమానిస్తున్నారు.