Vinod Kumar | హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీదారులను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకువెళ్లకుండా రేవంత్ రెడ్డి ఎందుకు విస్మరించారు అని అడిగారు. తెలంగాణ భవన్లో బోయినపల్లి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
అంబేద్కర్ జీవిత చరిత్రను మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించాలి. రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలి. జూన్ 2వ తేదీన మిస్ వరల్డ్ విజేతలు, పోటీదారులను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లే ముందు అమరజ్యోతిని చూపించాలి అని వినోద్ కుమార్ సూచించారు.
నాగార్జున సాగర్, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి, యాదగిరి గుట్టను మిస్ వరల్డ్ పోటీదారులు దర్శించుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాయాన్ని పరిశీలించారు. ప్రపంచంలోనే గొప్పగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నాం.. ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం మిస్ వరల్డ్ పోటీదారులకు చూపించకుండా రేవంత్ రెడ్డి విస్మరించారని వినోద్ కుమార్ మండిపడ్డారు.
కాళేశ్వరం కమీషన్ నోటీసులపై వినోద్ కుమార్ స్పందించారు. కమీషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఏం నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో ఏముందో తెలిసిన తర్వాత స్పందిస్తామని వినోద్ కుమార్ తెలిపారు.