హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గిరిజన జాతి ఎప్పటికీ మరచిపోదని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు పట్ల హర్షం వ్యక్తంచేస్తూ.. మంగళవారం బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో గిరిజన, ఆదివాసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిజమైన భూమిపుత్రుడని కీర్తించారు. గిరిజనుల కోరికలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. బంజారాహిల్స్‌లో బంజారాభవన్ నిర్మాణంతోపాటు 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని, బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని విజ్ఞప్తిచేశారు. సంత్ సేవాలాల్ జయంతినాడు సెలవు ప్రకటించాలని, ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అపరిష్కృతంగా ఉన్న గిరిజనుల డిమాండ్లన్నింటినీ సీఎం కేసీఆర్ నెరవేర్చారని మాజీ పోలీసు అధికారి డీటీనాయక్ కొనియాడారు. అడిగేందుకు ఇంకేమీ లేకుండా అన్నింటినీ నెరవేర్చారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సదస్సులో గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు కిషన్‌నాయక్, మోహన్‌నాయక్, పాండురంగనాయక్, మోహన్‌సింగ్, రామచందర్‌నాయక్, నారాయణనాయక్, ధనుంజయ, సోన్లాల్ తదితరులు పాల్గొన్నారు.