హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హులై ఉండి రుణమాఫీ కాని రైతులు ఇంకా సగానికిపైగా ఉన్నారని, ఇందుకు తమకు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హత ఉండి రుణమాఫీ వర్తించని రైతుల ఫిర్యాదు కోసం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్ 83748 52619కు 48 గంటల్లో 3,562 కాల్స్, 42,984 వాట్సాప్ మెస్సేజ్‌లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఏ స్థాయిలో అమలవుతున్నదో వచ్చిన ఈ ఫిర్యాదులే నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నిలదీతకు భయపడి, దేవుళ్లపై పెట్టిన ఒట్ల నుంచి తప్పించుకొనేందుకు తూతూమంత్రంగా రేవంత్‌రెడ్డి సర్కారు రుణమాఫీని అమలుచేస్తున్నదని విమర్శించారు.
బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4,500 పైచిలుకు గ్రామాల నుంచి సన్న, చిన్నకారు, దళిత, బలహీనవర్గాల రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని వివరించారు. రుణమాఫీ రైతుపక్షంగా కాకుండా ప్రభుత్వపక్షంగా జరిగిందని మండిపడ్డారు. రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అయిందని, ఆధార్‌కార్డులో చిన్నతప్పు ఉన్నా కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీని రేషన్‌కార్డుతో లంకె పెట్టడం లేదని పైస్థాయిలో చెప్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. కొందరికి వీసా ఉన్నదని, కొన్నితండాల్లో భూ రికార్డులు సరిగా లేవని రుణమాఫీ చేయలేదని చెప్పారు. బ్యాంకర్లకు లేని నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకు? అని నిలదీశారు.
‘రైతు భ రోసా ఎగ్గొట్టారు.. పంటలకు బోనస్‌ను బోగస్ చేశారు.. ఆ డబ్బులను రుణమాఫీకి కేటాయించారు’ అని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు రూపంలో రూ.72 వేల కోట్లు, రుణమాఫీ రూపంలో మరో రూ.30 వేల కోట్లు రైతులకు అందించినట్టు గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే క్షేత్రస్థాయిలో రైతు సదస్సులు పెట్టి రుణమాఫీపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. రైతుభరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం విహారయాత్రలకే పరిమితమైందని ఆరోపించారు. సివిల్ సప్లయ్ కుంభకోణంపై త్వరలోనే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుచేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు జరిగిన అవమానం సంపత్ చేసింది కాదని, సరారే చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ దాష్టీకాలపై అలంపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తుమ్మిళ్ల నీళ్లను తాకే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు
ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు జరిగిన అవమానం సంపత్ చేసింది కాదని, కాంగ్రెస్ సరారు చేసిందేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. ఓ వైపు రాహుల్‌గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకొని తిరుగుతుండగా, మరోవైపు ఆ పార్టీ నాయకుడు దళిత ఎమ్మెల్యేపై దాడిచేసి రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన ఎమ్మెల్యే హక్కులను ఏ అర్హత, అధికారం లేని కాంగ్రెస్ నాయకుడు సంపత్ దాడిచేసి కాలరాయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రూ.700 కోట్లతో తుమ్మిళ్ల ప్రాజెక్టును నిర్మించింది, ఆయకట్టుకు నీరు అందించి కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. తుమ్మిళ్ల లిఫ్టునే కాదు.. ఆ నీటిని తాకే అర్హత కూడా కాంగ్రెస్ నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నడిగడ్డలో కాంగ్రెస్ రక్తంపారిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు పారించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ దాష్టీకాలపై ఆలంపూర్లో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.